ముంబై: స్టాక్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. దేశీయ టైర్‌మేకర్స్ ఎంఆర్ఎఫ్ షేర్లు లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించాయి. ఒక్క షేర్ ధర గరిష్ఠంగా రూ.
1,00,439.95 పైసలకు చేరింది. లక్ష రూపాయల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న తొలి దేశీయ స్టాక్స్‌గా చరిత్ర సృష్టించింది ఎంఆర్ఎఫ్. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో ఆల్ టైమ్ రికార్డ్‌ను నెలకొల్పింది.
ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ ఎంఆర్ఎఫ్ షేర్ ధర కొంత క్షీణించినప్పటికీ- అది సృష్టించిన ప్రకంపనలు మాత్రం తగ్గట్లేదు. ఉదయం 11:30 గంటల సమయానికి 99,848 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు 98,968 రూపాయల వద్ద ఎంఆర్ఎఫ్ షేర్ ధర ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభమైన వెంటనే ఉప్పెనలా ఎగిసింది. తొలిగంటలోనే 1,000 రూపాయల మేర పెరిగింది.
ఉదయం 9:45 నిమిషాలకు లక్ష రూపాయలను అధిగమించింది. ఒక్క షేర్ ధర 1,00,066 రూపాయల వద్ద నిలిచింది. క్రమంగా దాని ధర మరింత పెరుగుతూ వెళ్లింది. గరిష్ఠంగా రూ.1,00,439.95 పైసలకు చేరింది. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. శుక్రవారం నుంచీ ఎంఆర్ఎఫ్ షేర్ ధర ఎగిసిపడుతూనే వస్తోంది. మే 8వ తేదీన ఎంఆర్ఎఫ్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం, వార్షిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన తరువాత ఈ పెరుగుదల చోటు చేసుకుంది.
ఫలితాలను వెల్లడించినప్పుడే గరిష్ఠంగా 99,933 రూపాయలు పలికింది ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్. 2021 జనవరిలో మొదటిసారిగా 90,000 రూపాయల మార్క్‌ను అందుకున్న తరువాత దాని ధరలో స్థిరత్వం కనిపించింది. ఈ మార్క్ దాటి కిందికి రాలేదు షేర్ ధర. సుమారు రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత లక్ష రూపాయలను అధిగమించింది.
