కేటీఆర్ సమక్షంలో వరంగల్ లో టెక్స్టైల్ పార్క్.!ఈ నెల 17న ముహూర్తం.!మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణ.!

హైదరాబాద్: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు తేదీ ఖరారు అయిందని, ఈనెల 17వ తేదీన మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్ల చుట్టుముట్టు ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే విధంగా కొడకండ్లలో సిరిసిల్ల తరహాలో టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామన్నారు.

కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన : సీఎం చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారు అందుకు అవసరమైన అనుమతులు ఇచ్చారని, తదనుగుణంగా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు సరిపడా స్థలాన్ని సేకరించడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అట్టి స్థలంలో సిరిసిల్ల మోడల్ లో టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటు చేసి ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. ఇప్పుడు కొడకండ్ల మినీ టెక్స్ట్ టైల్ పార్కు శంకుస్థాపనకు తేదీ కూడా ఖరారు కావడంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో ఉన్నతాధికారులతో ఎర్రబెల్లి సమీక్ష : కొడకండ్ల లో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి. వలస వెళ్లే ఇక్కడి ప్రాంతాల ప్రజలు తిరిగివచ్చే అవకాశం ఉందని, వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉందని. కొడకండ్ల ప్రాంత అభివృద్ధితో పాటు ఇక్కడి చేనేత కార్మికులకే కాక, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో కొడకండ్ల రూపు రేఖలు మారరున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

YES9 TV