టీడీపీ నాయకత్వంపై కోడెల తనయుడు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ఇప్పుడు కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు ఇవ్వటాన్ని తప్పుబడుతున్నారు. కోడెల మరణం తరువాత తన తల్లి..తన కుటుంబాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పుకొచ్చారు. బొజ్జల..బాలయోగి..గాలి వంటి నేతలు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చిన గౌరవం తమకు ఎందుకు లేదని కోడెల శివరాం నిలదీసారు.
కన్నాకు సీటు ఖరారు : సత్తెనపల్లి ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకుంటూనే నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. సహకరించాలని కోరారు. ఎవరూ మీడియా ముందు వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పార్టీ అభ్యర్ధిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయటం ఖాయమైంది. ఇదే అంశం పైన కన్నా కూడా స్పందించారు. తాను కొందరి నేతలతో మాట్లాడినట్లుగా వెల్లడించారు. తనకు పార్టీ టికెట్ ఖరారు చేస్తే తాను పార్టీ నాయకత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వెల్లడించారు. సత్తెనపల్లిలో అనేక సమస్యలు పరిష్కరించాల్సిని ఉన్నాయని వివరించారు. తాను ఎందుకు సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగుతుందీ త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.
ఆగ్రహంతో కోడెల శివరాం : సత్తెనపల్లి ఇంఛార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణ పేరు ప్రకటించగానే కోడెల తనయుడు శివరాం అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు కన్నాను నియమిస్తూ పార్టీ నేతలతో మాట్లాడినట్లుగానే కోడెల మరణం తరువాత తన నియామకం పైన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పార్టీని బలోపేతం చేసేందుకు చివరి నిమిషం వరకు పోరాటం చేసిన కోడెల వంటి నేత కుటుంబానికి ఇదేనా ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. పల్నాడులో రాజకీయంగా బలం సాధించాలంటే ముందుగా కోడెలను టార్గెట్ చేసే ఉద్దేశంతో వైసీపీ అక్రమ కేసులు పెట్టిందని పేర్కొన్నారు. చంద్రబాబు ను అనేక సందర్భాల్లో దూషణలతో టార్గెట్ చేసిన కన్నాకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీసారు.
తదుపరి అడుగులు ఎటు : తాను. తన కుటుంబ సభ్యులు చాలా రోజులుగా చంద్రబాబును కలిసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కనీసం తాము కలిసేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వటం లేదన్నారు. పార్టీలో సీనియర్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చారని శివరాం గుర్తు చేసారు. మరి పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటం చేసిన కోడెల కుటుంబం పైన ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శివరాం అభిప్రాయం పడ్డారు. నియోజకవర్గంలోని మిగిలిన నేతలతోనూ పార్టీ నాయకత్వం చర్చలు చేస్తోంది. ఇప్పుడు కన్నాకు బాధ్యతలు ఇవ్వటం పైన ఆగ్రహంతో ఉన్న కోడెల శివరాం రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.
