Latest Posts

వివేకా హత్యకేసులో 6 గంటలు విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సీబీఐ నాలుగోరోజు విచారించింది. ఉదయం 9.00 గంటల సమయంలో అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారిద్దరినీ సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చి 6 గంటల పాటు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వీరిద్దరినీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు కస్టడీ గడువు ఉండటంతో వారినుంచి మరికొన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఏమీ తెలియదన్న ఉదయ్ కుమార్ రెడ్డి : ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
విచారణ పూర్తయిన తర్వాత భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిద్దరినీ రెండు గదుల్లో ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భాస్కర రెడ్డి సమక్షంలో ఉదయ్ కుమార్ రెడ్డిని అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వివేకా, భాస్కర్ రెడ్డి కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు ఉదయ్ కుమార్ రెడ్డి తెలియదనే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డిని కూడా వీటికి సంబంధించిన అంశాలపైనే విచారించారు. వెన్ను నొప్పి కారణంగా మధ్యాహ్నం ఆయనకు కొంత సమయం విశ్రాంతి ఇచ్చారు.
సోమవారం పూర్తి స్పష్టత : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో దూకుడు పెంచిన సీబీఐ అనుమానితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకొని ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. అవినాష్ రెడ్డిని ఈనెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వివేకా కుమార్తె సునీత దీన్ని సుప్రీంలో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు స్టే విధించింది. సోమవారం దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Posted Under AP
YES9 TV