Latest Posts

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది.

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది.

ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ… ఆదివారం ఉదయం ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఇదీ కాస్త ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామంగా మారింది. అయితే తన తండ్రి అరెస్ట్ పై ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన….. వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను పూర్తిగా సీబీఐ అధికారులు పక్కన పెట్టేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ ఈ స్థాయికి దిగజారడం విచారకరమన్నారు.

వివేకానందా రెడ్డి స్వయంగా రాసిన లేఖను సీబీఐ అధికారులు పట్టించుకోవటం లేదని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. పాత అధికారుల తీరు మాదిరిగానే కొత్త అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆయన మరణించిన సమయంలో పోలీసులకు తానే స్వయంగా సమాచారం ఇచ్చానని గుర్తు చేశారు. హత్య గురించి ముందుగా తెలిసింది వివేకా అల్లుడికేనన్న అవినాశ్ రెడ్డి… నాకంటే గంటముందుగానే విషయం తెలిసినా ఆయన పోలీసులకు చెప్పలేదన్నారు. సమాచారం దాచినా వివేకా అల్లుడిని విచారించటం లేదని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోందన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని విమర్శించారు. హత్య చేసి అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా కీలకంగా భావిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సీబీఐ అప్రూవర్ కు బెయిల్ ఇచ్చి సహకరించడం దుర్మార్గం అని అవినాశ్ రెడ్డి కామెంట్స్ చేశారు. సీబీఐ అధికారులు, సునీతా రెడ్డి కేసును మరో కోణంలోకి తీసుకెళ్తున్నారని చెప్పారు.

భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్‌ చేయించారని అవినాశ్ రెడ్డి అన్నారు. . ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఉదయం భాస్కరరెడ్డి అరెస్ట్.

వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇంటికి ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు వెళ్లారు. పులివెందులలో భాస్కరరెడ్డి నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు సుమారు రెండు గంటల పాటు విచారణ చేశారు. అనంతరం భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు. భాస్కరరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాస్కరరెడ్డిని అరెస్ట్ చేయటంతో వివేకా హత్య కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచినట్లు అయింది.

YES9 TV