‘మోదీజీ.. ప్లీజ్ సాయం చేయండి’- ప్రధానికి చిన్నారి అభ్యర్థన`

సీరత్ నాజ్ (Seerat Naaz) అనే బాలిక ప్రధాని మోదీ (PM Modi)కి ఒక వీడియో సందేశాన్ని పంపించింది. తను చదువుకునే ప్రభుత్వ పాఠశాల దుస్థితిని సెల్ఫీ వీడియో లో వివరిస్తూ, స్కూల్ ను బాగు చేయాలని ముద్దుగా అభ్యర్థిస్తూ ఆ బాలిక మోదీకి పంపిన సందేశం నెటిజన్ల మనసులను చూరగొంటోంది.

Girl’s wish to Modi: సెల్ఫీ వీడియోలో..

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కథువా (Kathua) జిల్లా లోహాయి మల్వార్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ (Seerat Naaz) స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. తన పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, స్కూల్ లో కనీస వసతులు లేని పరిస్థితి, టాయిలెట్ల దుస్థితి, కొత్తగా కడ్తున్న బిల్డింగ్ సంవత్సరాల తరబడి అతీగతీ లేకుండా పడి ఉన్న సంగతి.. సీరత్ నాజ్ (Seerat Naaz) ఆ సెల్ఫీ వీడియోలో వివరించింది. స్కూల్ లోని ఒక్కో ప్రదేశాన్ని వీడియోలో చూపిస్తూ, అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులను ఆ బాలిక వివరించింది. ”ప్లీజ్ మోదీజీ .. ఏక్ అచ్చీసీ స్కూల్ బన్వా దేనా (ప్లీజ్ మోదీజీ.. మాకొక మంచి స్కూల్ ను కట్టించి ఇవ్వరా..)” అంటూ ఆ బాలిక ముద్దుముద్దగా ప్రధాని మోదీని కోరింది.

Girl’s wish to Modi:మోదీజీ.. మా కోరిక తీర్చండి

తనను తాను పరిచయం చేసుకుంటూ దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియో రికార్డింగ్ ను సీరత్ నాజ్ (Seerat Naaz) ప్రారంభించింది. ఈ తరువాత స్కూల్ కాంపౌండ్ మొత్తం తిరుగుతూ, అక్కడి దుస్థితిని వివరిస్తూ.. ”మోదీ జీ.. ముఝే ఆప్ సే ఏక్ బాత్ కెహనీ హై (మోదీజీ.. మీకు ఒక విషయం చెప్పాలి)” అని ఫిర్యాదు చేస్తున్నట్లుగా.. ఆ వీడియోను రికార్డ్ చేసింది. ప్రిన్సిపాల్ గది ముందు, స్టాఫ్ రూమ్ ముందు అపరిశుభ్రంగా ఉన్న ఫ్లోర్ ను చూపిస్తూ.. ”చూడండి.. ఎంత అపరిశుభ్రంగా ఉందో.. ఇక్కడే మేం కింద కూర్చుని చదువుకోవాలి” అని వివరించింది. పక్కనే గత ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ను చూపిస్తూ.. ఆ బిల్డింగ్ పరిస్థితిని వివరించింది. అనంతరం, తమ టాయిలెట్ల పరిస్థితిని చూపిస్తూ, సరైన టాయిలెట్ వసతి కూడా లేదని ఫిర్యాదు చేసింది. చివరగా.. ”ప్లీజ్.. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మాకొక మంచి స్కూల్ ను కట్టివ్వండి. కింద కూర్చవడం వల్ల మా యూనీఫామ్స్ పాడవుతున్నాయి. మురికి పట్టిన యూనిఫామ్ ను చూసి మా అమ్మ కొడుతోంది. మా స్కూల్ లో బెంచెస్ కూడా లేవు. ప్లీజ్ నా మాట వినండి. మాకొక మంచి స్కూల్ నిర్మించి ఇవ్వండి” అని ఆ బాలిక అభ్యర్థించింది. ”మీరు మొత్తం దేశం చెప్పేదంతా వింటారు. మా కోరిక కూడా వినండి. మాకొక అందమైన పాఠశాల కట్టివ్వండి. కింద కూర్చునే అవసరం లేని, యూనీఫామ్ పాడైందని అమ్మకొట్టే పరిస్థితి రాని స్కూల్ ను కట్టివ్వండి” అని ఆ బాలిక సీరత్ నాజ్ (Seerat Naaz) ముద్దుముద్దుగా కోరుతూ ఉన్న దృశ్యాలతో ఉన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

YES9 TV