ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకొంటే దానికి ఒక్కసారి శంకుస్థాపన చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం గతంలో శంకుస్థాపనలు జరిగిన వాటికి నిర్మాణ పనులు ప్రారంభించకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి, ఎన్నికల దగ్గరపడుతుంటే మళ్ళీ శంకుస్థాపనలంటూ హడావుడి చేస్తోంది.
మే 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. భోగాపురంలో 2,200 ఎకరాల విస్తీర్ణంలో జిఏంఆర్ సంస్థ రెండు మూడేళ్ళలో విమానాశ్రయం నిర్మిస్తుందని చెప్పారు.
నాలుగేళ్ళ క్రితం అంటే 2019, ఫిభ్రవరి 14వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. మరి ఆయన కూడా ఎందుకు పూర్తి చేయలేదు?అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎటువంటి దయనీయ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు అనేక సమస్యలను పరిష్కరించుకొంటూ, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించారు.
అదే సమయంలో విశాఖనగరం, ఉత్తరాంద్ర జిల్లాలు ఐటి, సినీ, పర్యాటక, వ్యాపార రంగాలకు అత్యంత అనువైనవని గుర్తించి, మూడు జిల్లాలకు మద్యలో భోగాపురం వద్ద ఓ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించడం చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనం. దాని కోసం భూసేకరణ మరో మహాయజ్ఞం! దానిని పూర్తి చేసే సమయానికి ఏపీలో రాజకీయ వాతావరణం ఏవిదంగా మారిపోయిందో అందరూ చూశారు.
కారణాలు ఏవైతేనేమీ. ప్రజలు చంద్రబాబు నాయుడుని కాదని జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఈ నాలుగేళ్ళలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మూడు రాజధానులు కాదు కదా. కనీసం విశాఖ రాజధాని ఏర్పాటు చేయలేక చేతులెత్తేశారు. రాజధాని పంచాయతీ సుప్రీంకోర్టులో ఉంది కనుక జగన్ ప్రభుత్వం ఇప్పుడు విశాఖలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.
ఇంకా విశాఖ రాజధాని పాట పాడినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ విషయం బ్యానర్ పెట్టి మరీ చెప్పేశారు. ఇక మిగిలింది ఒకే ఒక్క సంవత్సరం. కనుక ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలకు చెప్పుకోవడానికి మరో కొత్త కధ కావాలి. అదే భోగాపురం విమానాశ్రయం. అందుకే శంకుస్థాపన. ఆ పేరుతో మరో ఏడాది కాలక్షేపం చేయడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ముందస్తు ఎన్నికల కోసమైనా కావచ్చు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు భోగాపురంలో భూములు సేకరించి వడ్డించిన విస్తరిలా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ జిఎంఆర్ సంస్థ పూనుకొంటే అక్కడ నిర్మాణపనులు కూడా ప్రారంభం కావచ్చు. వాటిని చూపిస్తూ, చెప్పుకొంటూ ప్రజలను మళ్ళీ రెండో ఛాన్స్ ఇమ్మనమని అడగవచ్చు. ప్రజలు ఇచ్చినా ఇవ్వచ్చు.
అయితే అమరావతిని నిర్మించడానికి ఇష్టపడని జగన్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం ఎందుకు నిర్మించాలనుకొంటోందో? నిజంగా భోగాపురం విమానాశ్రయం నిర్మించే ఉద్దేశ్యమే ఉండి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి నిర్మాణం పూర్తయి ఉండేది. కానీ నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారంటే అర్దం ఏమిటి?
