తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నో సంస్థలు ప్రేక్షకుల్లో చెరగలేని ముద్రవేశాయి. వాటికంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్నాయి. కాని పాలగిన్నెలో ఒక్క చిటికెడు ఉప్పు వేస్తే మొత్తం చెడిపోయినట్టు కొన్ని తొందరపాటు పనులు కేవలం రెవిన్యూ కోణంలో తీసుకునే నిర్ణయాలు అసలుకే మోసం తెస్తాయి.
మైత్రి మూవీ మేకర్స్ గత కొన్ని నెలలుగా ఇలాంటి పొరపాట్ల వల్ల డబ్బు పరంగా పెద్దగా నష్టపోకపోయినా ఇమేజ్ పరంగా పోగొట్టుకుంటున్నది డబ్బు కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తోంది. మీటర్ కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేనంత డిజాస్టర్ గా ముద్రపడిపోవడం హీరోకే కాదు ప్రొడక్షన్ కంపెనీకి సైతం డ్యామేజ్ చేస్తోంది.
గత ఏడాది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హ్యాపీ బర్త్ డేలు సైతం ఇదే బాట పట్టాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న టైంలో ఇలాంటి చిన్న మరకలు సైతం ప్రేక్షకుల్లో పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ చెప్పిన మూడు చిత్రాలు డిజిటల్ డబ్బింగ్ గట్రా రూపాల్లో మొత్తం వెనక్కు తెచ్చి ఉండవచ్చు. కానీ థియేటర్లలో ఆడనప్పుడు దాన్ని ఫ్లాప్ కిందే చూస్తారు. అమిగోస్, అంటే సుందరానికి లాంటివి పోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాటిలో స్టార్లు ఉన్నారు కాబట్టి ఆడియన్స్ వాటిని మరీ తీసికట్టుగా చూడరు. కానీ చిన్నవాటికి అలాంటి లెక్కలు పని చేయవు
ఒకప్పుడు రామానాయుడు గారు 1998 తర్వాత సరైన హిట్లు లేక తన జడ్జ్ మెంట్ తప్పుతోందని గుర్తించి నిర్మాణం తగ్గించుకున్నారు. డబ్బులు పోతున్నాయని కాదు సురేష్ బ్రాండ్ కి మార్కెట్ లో విలువ తగ్గిపోయే ప్రమాదాన్ని గుర్తించి. విజయా సంస్థ మాస్ హీరోల మార్కెట్ పెరిగాక తానుగా పక్కకు తప్పుకుంది. తర్వాత భైరవ ద్వీపం, బృందావనం (రాజేంద్రప్రసాద్) లాంటి మంచి చిత్రాలు తీసినా తర్వాత కొనసాగించలేకపోయారు. నువ్వే కావాలి, చిత్రం, ఆనందం లాంటి బ్లాక్ బస్టర్ల కన్నా వరసగా వస్తున్న ఫ్లాపుల దెబ్బకు జడిసి ఉషాకిరణ్ బ్యానర్ చాలా ఏళ్లుగా ప్రొడక్షన్ కు దూరంగా ఉన్నారు. వనరులు లేక కాదు తమ బ్రాండ్ ని తగ్గించుకోకూడదనే ఉద్దేశంతో
ఇకపై డిజిటల్ నుంచి డబ్బులు వస్తాయనో లేదా డబ్బింగ్ రీమేకుల నుంచి ఈజీగా గట్టెక్కిపోతామనో ముందు వెనుక చూసుకోకుండా ఏది బడితే దాన్ని తీసుకుంటూ పోతే ఇదే ట్రెండ్ ఎల్లవేళలా ఉండదు. కరోనా సమయంలో వెంటపడి సినిమాలు కొన్న ఓటిటిలు ఇప్పుడు రివర్స్ లో అమ్మడానికి వెళ్తున్న చోటా ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. బలవంతంగా థియేట్రికల్ రిలీజ్ చేయించి నిర్మాత సొమ్ములన్నీ కరిగిపోయాక రేట్లు తగ్గిస్తున్నాయి. పెద్దవాళ్లకు ఇదేమీ సమస్య అనిపించకపోవచ్చు. కానీ రూపాయి ఎవరికైనా రూపాయే. రాబోయే రోజుల్లో బ్రేక్ ఈవెన్ కాని సినిమాలకు కొనమని ఓటిటిలు తెగేసి చెబితే కానీ ఈ వ్యవహారం దారికి వచ్చేలా లేదు
