Latest Posts

సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయనున్న సచిన్ పైలట్: కీలక కామెంట్లు

రాజస్థాన్‍లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో రచ్చ తీవ్రమవుతోంది.

ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా సీఎంపై సచిన్ పైలట్ మరో యుద్ధం ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈనెల 11న ఒక రోజు దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Rajasthan – Sachin Pilot: వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. విచారణ చేపట్టకుంటే.. బీజేపీతో చేతులు కలిపినట్టు ప్రజల్లోకి సంకేతాలు వెళతాయంటూ కీలక కామెంట్లు చేశారు. 2018 ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు, ప్రకటనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయని, బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఎన్నికల కోడ్ రాకముందే విచారణ ప్రారంభించాలని సచిన్ పైలట్ అన్నారు. ఈ డిమాండ్‍తోనే ఏప్రిల్ 11వ తేదీన జైపూర్‌లో ఒక రోజు దీక్ష చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు.

మా ప్రభుత్వం విఫలమైంది

Rajasthan – Sachin Pilot: సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మరోసారి విమర్శలు గుప్పించారు. మద్యం మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవటంతో సీఎం గహ్లోత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

వసుంధర రాజే హయాంలో అవినీతి జరిగిందంటూ గతంలో గహ్లోత్ చేసిన వ్యాఖ్యల వీడియోను సచిన్ పైలట్ ప్రదర్శించారు. మరి, విచారణ ఎందుకు ప్రారంభించడం లేదని సీఎం గహ్లోత్‍ను ప్రశ్నించారు. గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ వద్ద ఆధారాలు ఉన్నాయని, కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.

ఎన్నికల ముంగిట..

Rajasthan – Sachin Pilot: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య మరోసారి యుద్ధం తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. 2020లోనే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం సచిన్ పైలట్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత పూర్తిస్థాయి మద్దతు లేకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు.

తిరుగుబాటు చేసినందుకు గాను.. కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్ పైలట్‍ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని తొలగించింది. అయినా, గహ్లోత్ వర్సెస్ పైలట్ యుద్ధం కొనసాగింది.

YES9 TV