అక్కినేని అఖిల్.. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో ఒకరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ యంగ్ తరంగ్ తన సత్తా ఏనాడో చాటుకున్నాడు. హీరోగా మారి 7ఏళ్లు గడుస్తున్నా.. సినిమా ఎంట్రీ జరిగి 27ఏళ్లు గడిచాయి. మరెవరికీ సాధ్యంకాని రీతిలో ఏడాది వయసులోనే తెరపై పూర్తిస్థాయిలో కినిపించి టాలీవుడ్ భవిష్యత్ ఆశాకిరణం అయ్యాడు. ‘సిసింద్రీ’గా బుడిబుడి అడుగులతో తెరపై సందడి, అల్లరి చేస్తూ చెలరేగిపోయిన నాటి బుడతడు నేడు హీరో అయ్యాడు. అక్కినేని మూడో తరంగా సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నాడు. తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున తెలుగు తెరపై సృష్టించిన ప్రభంజనం, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పొందిన స్థానం దృష్ట్యా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న అఖిల్ పుట్టినరోజు నేడు. మూడో తరం హీరోగా.. తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నేడు భారతీయ సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ ఓ బ్రాండ్. ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేసింది నాగార్జున. ఇప్పుడు మూడో తరం కూడా దీనినే కంటిన్యూ చేస్తోంది. వారిలో అక్కినేని నాగ చైతన్య, అఖిల్ ఒకరు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన మనం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వండర్. మరే ఫ్యామిలీ నుంచి మూడు తరాలు ఒకే సినిమాలో నటించడం.. అదీ పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించడం జరగలేదు. ఆ వండర్ ఫిల్మ్ ద్వారా తన ఎంట్రీ ఎలా ఉండబోతోందో చిన్న క్యామియోలో క్యూట్ లుక్స్ తో చాటిచెప్పాడు. తర్వాత ఫుల్ లెంగ్త్ హీరోగా డైరక్టర్ వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమానే ‘అఖిల్’. సరైన కంటెంట్ పడితే.. ఫలితంతో సంబంధం లేకుండా నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. డ్యాన్సుల్లో కూడా మంచి ఈజ్ చూపాడుడు. తండ్రి నాగార్జున తొలి సినిమా హిట్టయ్యాక నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టింది. అఖిల్ కు అదే వారసత్వంగా వస్తోందని త్వరలోనే సత్తా చాటుతాడని అభిమానుల నమ్మకం. ప్రస్తుతం అఖిల్ నటించిన ఏజెంట్ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాలో స్టిల్స్, మేకోవర్ అఖిల్ కష్టాన్ని తెలుస్తోంది. సరైన కంటెంట్ కోసం చూస్తున్న అఖిల్ కు యాక్షన్ మోడ్ కలిసొచ్చే అంశం. చిన్ననాటే మెప్పించిన అఖిల్ కు సరైన కంటెంట్ పడితే దూసుకుపోవడం ఖాయమే. అఖిల్ కు సక్సెస్ లు రావాలని.. స్టార్ హీరోగా అక్కినేని లెగసీని నిలబెట్టాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.
ఇక మెరుపులు ఖాయమే.. అక్కినేని అఖిల్ బర్త్ డే
