దేశంలో కరోనా డేంజర్ బెల్స్..10వేల 300 కేసులు నమోదు…

కరోనా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరీక్షలు పెంచడంతోపాటు.. సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని.. మాస్కులు ధరించాలని సూచించింది. కాగా.. దేశంలో కరోనా కేసులు వరుసగా రెండోరోజు 18వందలకు పైనే నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య పది వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 10వేల 300 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దేశంలో 2020 ఏప్రిల్‌ తర్వాత 2022 నవంబర్‌లో యాక్టివ్‌ కేసులు పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం.

 

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడం ఇదే ప్రథమం.దేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

 

ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ దిశానిర్దేశం చేయనుంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది.

Editor