అవసరార్థం రాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన ఘనుడు దేశంలో లేడన్న టాక్ తెలుగు నాట ఉంది. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని..
ఎంతటి శత్రువునైనా కౌగిలించుకుంటాడని.. సొంత పిల్లనిచ్చిన మామను కూడా గద్దెదించుతాడని ఆయన చరిత్రను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. 2019లో బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ పంచన చేరి రాహుల్ ను ప్రధాని చేయాలని చంద్రబాబు ఎక్కని ఫ్లైట్ లేదు.. తొక్కన గడపలేదు. అయితే చంద్రబాబు బ్యాడ్ లక్. దేశంలో కాంగ్రెస్ ఓడింది. ఆంధ్రాలో బాబు ఓడాడు. అందుకే తత్త్వం బోధపడి బీజేపీకి మద్దతుగా తన నలుగురు రాజ్యసభ ఎంపీలను పంపి సంధి చేసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ కలిస్తే పొత్తు పెట్టుకొని సాగడానికి రెడీ ఉన్నాడు. కానీ ఏపీ బీజేపీ నేతలు.. కేంద్రం పెద్దలు ఒకసారి మోసం చేసిన చంద్రబాబుతో కలిసి సాగేందుకు రెడీగా లేరు. పవన్ కళ్యాణ్ ను దూరం చేసేలా బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇవన్నీ అవగతం చేసుకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సడెన్ గా గేర్ మార్చేశాడు. బీజేపీపై పూర్తిగా ఆశలు వదిలేసి అసలు రాజకీయం షురూ చేశాడన్న చర్చ సాగుతోంది..
-బీజేపీని దెబ్బతీయడమే ధ్యేయంగా పావులు..
బీజేపీ పొత్తులకు రెడీగా లేదు. పిలిచినా రావడం లేదు. సో ఇక యాంటీ బీజేపీ పాలిటిక్స్ ను చంద్రబాబు రెడీ చేస్తున్నారు. నాడు బీజేపీలోకి పంపిన నేతలందరినీ తిరిగి టీడీపీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఇక బీజేపీలో ఉక్కపోతతో అసంతృప్తితో రగులుతున్న నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీని దెబ్బతీయడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లిన నలుగురు ఎంపీలు.. తాజా మాజీ మంత్రులను తిరిగి రప్పించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అటువంటి వారంతా ఇప్పుడు టీడీపీకి టర్న్ అయ్యేలా చేస్తున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. వారంతా తమ అవసరాల కోసం వెళ్లారు తప్ప.. బీజేపీ విధానాలకు ఆకర్షితులయ్యో వెళ్లలేదన్నది జగమెరిగిన సత్యమే.
-నేడు కన్నా.. రేపు పురంధేశ్వరి.. టీడీపీలోకి నేతల క్యూ..
ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. రేపోమాపో టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఆయన బాటలోనే నెక్ట్స్ వచ్చేది బీజేపీలో సీనియర్ నాయకురాలు.. నందమూరి ఆడబిడ్డ పురంధేశ్వరి అన్న టాక్ నడుస్తోంది. తన సడ్డకుడి భార్య అయిన పురంధేశ్వరితో ఇటీవల చంద్రబాబు మాటలు కలిపారు. ఆమెకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోకి వస్తే పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. టీడీపీలో తన కుమారుడికి పర్చూరు టికెట్ , తనకు ఎంపీ టికెట్ ఖాయం చేసుకున్నాకే పురంధేశ్వరి టీడీపీలో చేరికకు ఒప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి చంద్రబాబు ఓకే అనడంతో పాత పగలన్నీ పక్కనపెట్టి పురంధేశ్వరి కూడా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇక ఆ తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు క్యూలో ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు అనుకూల వర్గం అంతా తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు రెడీ అయ్యారట.. సీఎం రమేష్ మాత్రం కొద్దిరోజులు అక్కడ పరిస్థితులన్నీ స్టడీ చేశాక బయటకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది.. అయితే ఈ నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రత్యేక టాస్క్ ఇచ్చి చంద్రబాబే బీజేపీలోకి సాగనపంపారు. బీజేపీ హైకమాండ్ కు ఈ విషయం తెలియంది కాదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహ్వానించారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల్లో చంద్రబాబుపై ఉన్న కోపాన్ని ఈ నలుగురు నాయకులు కొంతవరకూ తగ్గించగలిగారు. బీజేపీతో టీడీపీకి పొత్తుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలిగారు. కానీ పొత్తుకు బీజేపీ అంగీకరించకపోవడంతోనే ఇప్పుడు చంద్రబాబు రూటు మార్చి బీజేపీని టార్గెట్ చేసి దెబ్బతీసే పని పెట్టుకున్నారు. బీజేపీ నుంచి తర్వాత ఎవరెవరు టీడీపీలోకి వస్తారన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది.
