టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 5 వేలకు పైనే మరణాలు!

టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. మూడు సార్లు భారీ భూకంపం అనంతరం.. ప్రకంపనలు కొనసాగాయి. రిక్టర్‌ స్కేల్‌పై 4 కంటే ఎక్కువ స్థాయిలో 100 సార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్‌ సర్వే విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో కూడా 5 నుంచి 6 తీవ్రతతో మరికొంతకాలం ఈ ప్రకంపనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తుకు భారీగా భవనాలు నేలమట్టం అయ్యాయి. మరోవైపు విద్యుత్తు వ్యవస్థ, సహజ వాయు పైపు లైన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు రెండు దేశాల్లో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. గాయపడ్డవారిని ఇప్పటికీ బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

YES9 TV