రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు

ఇండియాలో 1950 నుండి ప్రతీ సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 26, 2023న భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. జనవరి 26, 1950న మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడాన్ని స్మరించుకుని, గౌరవించుకుంటూ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఆనందంగా, గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే దేశభక్తి పండగే ఈ గణతంత్ర దినోత్సవం. ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ.. ఇలా భారత త్రివిధ దళాల భాగస్వామ్యంతో ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. దేశం నలుమూలల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరైనా.. ఎక్కడి నుంచైనా ఈ వేడుకలను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇంకా వీలైతే వ్యక్తిగతంగా ఢిల్లీలో పరేడ్ వేడుకలకు సంబంధించిన ఎంట్రీ పాసులు తీసుకోవడం ద్వారా నేరుగా వేడుకలను వీక్షించవచ్చు.

జనవరి 26, రిపబ్లిక్ డే 2023 సమీపిస్తున్నందున గణతంత్ర దినోత్సవం 2023 పై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ? గణతంత్ర దినోత్సవం 2023 పరేడ్ జరిగే రూట్ ఏంటి ? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ టికెట్స్ ఎవరు ఇస్తారు ? ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయా ? ఎంత ఖరీదు అవుతుంది వంటి అనేక రకాల సందేహాలు చాలామందిని వేదిస్తుంటాయి. అలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రిపబ్లిక్ డే 2023 సెలబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా ఎవరు హాజరు కానున్నారు ? ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవం 2023లో జెండా ఎగురవేసే సమయం గణతంత్ర దినోత్సవ పరేడ్ 2023 ప్రత్యక్ష ప్రసారం కర్తవ్య పథ్ నుండి ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అమర్ జవాన్ జ్యోతిని సందర్శించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

రిపబ్లిక్ డే పరేడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంత దూరం జరుగుతుంది ? భారత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ జనవరి 26న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి రాజ్‌పథ్, ఇండియా గేట్ మార్గాల ద్వారా ఎర్రకోట వరకు కొనసాగుతుంది. పరేడ్ జరిగే ఈ మార్గం మొత్తం 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది. రిపబ్లిక్ డే 2023 థీమ్ ఏంటి ? ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో మూడు థీమ్స్ ప్లాన్ చేశారు. అందులో ఒకటి ఇండియా@75 కాగా రెండోది 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ థీమ్ కానుంది. ఇక మూడో థీమ్‌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నారీ శక్తి. అంటే మహిళా శక్తి లేదా మహిళా సాధికారత అన్నమాట. ఈ మూడు థీమ్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు లేదా మూడింటి కలయికను ఎంచుకుని రిపబ్లిక్ డే వేడుకల్లో వారి కళారూపాలను ప్రదర్శించవచ్చు. ఈ మేరకు రక్షణ శాఖ నుండి ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో ఇండియ@75 థీమ్ ప్లాన్ చేశారు. ఇందులో భారత స్వాతంత్ర్య పోరాటం, గత ఏడు దశాబ్దాలుగా సాధించిన విజయాలు వంటి అంశాలతో కళారూపాలను ప్రదర్శించాల్సి ఉంటుంది.

Editor