కోహ్లీ కుమ్మేశాడు

2019 తర్వాత కింగ్ కోహ్లీ(King Kohli)కి ఒక్క సెంచరీ కూడా లేదు.. పేలవమైన ప్రదర్శన.. 2021లో కెప్టెన్సీకి రాజీనామా.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఒత్తిళ్లు. ఆ సమయంలో కోహ్లీ మీద కామెంట్ చేయని వారు లేరేమో. క్రికెట్ ఫీల్డ్‌(Cricket Field)లో రకరకాల కారణాలతో వార్తల్లో నిలిచిన విరాట్ కోహ్లి(Virat Kohli) గతేడాది స్వల్ప విరామం తీసుకున్నాడు. ఈ విరామం తర్వాత కోహ్లి అనేక వ్యాఖ్యలకు గురి అయ్యాడు. అంతేకాకుండా కోహ్లి ఖేల్ ఖతం, కింగ్ కోహ్లి శకం ముగిసిందని, వీడ్కోలు చెప్పడమే బెటర్ లాంటి వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వీటన్నింటి మధ్య మౌనంగా ఉన్న విరాట్ కోహ్లీ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరంగా ఉన్నాడు. ఈ చిన్న విరామం తర్వాత మళ్లీ ఆసియా కప్‌లో కింగ్ కోహ్లీ కనిపించగా… ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన పాత ఫామ్‌ను ప్రదర్శించాడు. కొన్ని అడుగులు వెనక్కు వేసి.. మళ్లీ ముందుకు దూకాడు కింగ్ కోహ్లీ. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇప్పటి వరకు మొత్తం 26 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి కింగ్ కోహ్లీ తన బ్యాట్‌తో సరిగ్గా 4 సెంచరీలు సాధించాడు.

అంటే 2019 నుంచి 2021 వరకు ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో కింగ్ కోహ్లీ బ్యాటింగ్ తో 7 అర్ధ సెంచరీలు చేశాడు. అందరి విమర్శలను పక్కన పెడితే.. నెల రోజుల పాటు బ్యాట్‌ను తాకకుండా ఫీల్డ్‌కి దూరంగా ఉన్న కోహ్లీ.. తాను ఆడిన 26 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 50+ పరుగులు చేశాడు. 99 ఫోర్లు, 35 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌ల్లో 1155 పరుగులు వచ్చాయి. అంటే కింగ్ కోహ్లీ తన పాత జోరుకు తిరిగి వెళ్లాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ పునరాగమనం తర్వాత ఆడిన టీ20 ఇన్నింగ్స్‌లో 70 సగటుతో పరుగులు సాధించాడు. వన్డేలు, టెస్టుల్లో 82 సగటుతో పరుగులు రాబట్టాడు. ఈ మధ్య T20లో తన తొలి సెంచరీని, 4 ODIలలో 3 సెంచరీలను కూడా సాధించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ.. రికార్డులు బద్దలు కొడుతూ… కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. అది కూడా గతంలో విమర్శలు చేసిన కొందరు మాజీ ఆటగాళ్ల నోటి నుంచి రావడం విశేషం. మొత్తానికి చిన్న బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. పాత కోహ్లీగా వచ్చాడని చెబుతున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయని ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Editor