కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిల టీ20 భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్‌లో టీమ్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో పూర్తిగా యంగ్‌స్టర్స్‌తో ఓ ప్రత్యేకమైన టీమ్‌ను టీ20లకు ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కూడా కోరారు.
ఇప్పుడు బీసీసీఐ ఆ దిశగా సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోహిత్, విరాట్‌లతో వాళ్ల టీ20 భవిష్యత్తుపై బోర్డు చర్చించనుంది. ఈ ఇద్దరూ టీ20లకు కూడా తాము అందుబాటులో ఉంటామని చెప్పినా.. బీసీసీఐ మాత్రం ఈ సీనియర్లను వన్డేలు, టెస్టులకే పరిమితం చేయాలన్న ఆలోచనలో కనిపిస్తోంది. ఈ అంశంపై రానున్న రోజుల్లో చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ కూడా చర్చించనుంది.
