Latest Posts

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్రోహి చంద్రబాబు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్రోహి చంద్రబాబు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు.
28.11.2026న శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే (11.4.1827 – 28.11.1890) గారి 136వ వర్ధంతి సందర్భంగా కదిరి పట్టణం నడిబొడ్డున ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఏడున్నర అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారు హాజరై మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్రోహి అని చెప్పవచ్చు.
ఎందుకంటే రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు 28 ఉంటే, ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్ మించి ఇవ్వవద్దన్న తీర్పు మేరకు అంటే 14 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రావాలి. కాని దాదాపు 90 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, బీసీలకు 6, మైనార్టీలకు 1 మొత్తం 13 పదవులు ఇచ్చి, 10 శాతం జనాభా ఉన్న ఓసీలకు 15 పదవులు ఇవ్వడం చూస్తే చంద్రబాబు గారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ద్రోహి అనక ఇక ఏమనాలో ప్రజలే చెప్పాలని మనవి చేస్తున్నాము. జడ్పీ చైర్మన్ పదవులు బీసీలకు 21 శాతం మించి ఇవ్వలేదు.
2024 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో చట్టపరమైన రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలతో ఓట్లు వేయించుకొని, ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు తీర్పు 50 శాతం మించి ఇవ్వద్దన్న కారణంగా పార్టీ పరంగా 34 శాతం మించి అమలు చేస్తామని నమ్మబలికి, కనీసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50శాతం కూడా అమలు చేయకపోవడం ఎంత దుర్మార్గమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాము. ఎంపిపి పదవులు కూడా బీసీలకు 23 శాతం మించి ఇవ్వలేదు.
కాని టీవీ డిబెట్లలో టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అనే రెడ్డాయన 50 శాతం పైన, పట్టాభిరాం అనే కమ్మాయన 40 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు ఇచ్చామని చెబుతున్నారు. ఇక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే బీసీలకు మేము పదవులు ఇచ్చినంత మరి ఎవరు ఇవ్వలేదని మోసం, దగా మాటలు నిత్యం చెప్పడం జరుగుతూనే వుంది.
ఎటువంటి అధికారం లేని, కేవలం పేరుకు మాత్రమే చెప్పుకొనే జడ్పి వైస్ చైర్మన్ అనే పదవులు బీసీలకు 11, ఎస్సీలకు 1, ఎస్టీలకు 2, ముస్లింలకు 2 ఇచ్చి “సామాజిక న్యాయమే బలం జడ్పి పదవుల్లో ఇదే టిడిపి సూత్రం” అంటూ సిగ్గు, ఎగ్గు లేకుండా చెప్పుకోవడం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఘోరంగా మోసం, దగా చేయడమే కదా! అని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఈ తతంగమంతా చూస్తున్న ప్రతిపక్ష వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ అంశంపై స్పందించక పోవడం మరింత దుర్మార్గం.
ఈ రెండు కుల పార్టీలను రాజకీయంగా సమాధి చేయక పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జనాభా ప్రాతిపదికంగా రాజకీయ పదవులు కాని, విద్యా – ఉద్యోగ అవకాశాలు కాని, ఆర్థికాభివృద్ధి కాని తదితర అన్ని రంగాల్లో నష్టపొయ్యే అవకాశం ఉంది. కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాశయుల్లారా! వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించుకొంటే అన్ని రంగాల్లో సమానావకాశాలు లభిస్తాయి. కావున యావన్మంది బీఎస్పీకి ఓట్లు వేసి, వేయించి గెలిపించాలని మనవి చేస్తున్నాము.
ఇందులో పాల్గొన్నవారు:- బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు ఎ.సుబ్బరాయుడు, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ భాష, బాంసేఫ్ నరసింహులు, రామచంద్రయాదవ్, శేషు, నారాయణస్వామి, కోలా నూర్ మహమ్మద్, మడకా గోపాల్, గౌడ్ జయరాజు, వెంకటసుబ్బయ్య, గంగాధర్, జయప్పస్వామి, గోవర్దన్, పవన్, రామన్న, కేశవ, ప్రతాప్, సూర్యనారాయణ, పట్నం గంగన్న, చెండ్రాయిడు, వై.గంగన్న, రెడ్డప్ప, రెడ్డి భాష తదితరులు.
ఇట్లు
బహుజన్ సమాజ్ పార్టీ
అంపావతిని గోవిందు
బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ బీసీ/ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం.

Editor