బాలీవుడ్లో నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంపై రామానంద్ సాగర్ క్లాసిక్ ‘రామాయణ్’ సీరియల్లో లక్ష్మణుడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు సునీల్ లహ్రీ స్పందించారు. సినిమాపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్న వేళ ఆయన చిత్ర బృందానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దర్శకుడు నితేశ్ తివారీ గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారని, ఆయన ప్రతిభపై అలాగే రణ్‌బీర్ సహా నటీనటుల అంకితభావంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ ఇతిహాసం కేవలం భారతీయులకే కాకుండా యావత్ ప్రపంచ మానవాళికి గర్వకారణమైన మహాకావ్యమని ఆయన కొనియాడారు.
అయితే, చిత్ర సంగీతం విషయంలో మాత్రం సునీల్ లహ్రీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్, ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ స్వరకర్త హాన్స్ జిమ్మర్ వంటి దిగ్గజాలు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నప్పటికీ, తాను విన్న కొన్ని ట్రాక్స్, ధ్వనులు కొద్దిగా నిరాశపరిచాయని పేర్కొన్నారు. రామాయణం లాంటి కథనానికి సంగీతమే వెన్నెముక అని, ఆ స్వరాలలో అయోధ్య, మిథిల ప్రాంతాలకు సంబంధించిన నేలతనం, స్థానిక సంస్కృతి ప్రస్ఫుటంగా కనిపించాలని తాను ఆశిస్తున్నట్లు ఒక సాధారణ శ్రోతగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇది భారీ వ్యయంతో నిర్మితమవుతున్న సినిమా కావడంతో దీని విజయం చిత్రసీమకు ఎంతో కీలకమని సునీల్ లహ్రీ అభిప్రాయపడ్డారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఎందరో సాంకేతిక నిపుణులు, కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని, నటీనటులు, సాంకేతిక బృందం పడుతున్న శ్రమ ఫలించి సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ‘జై శ్రీరామ్’ అంటూ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
