Latest Posts

తిరుమలలో వెల్లువెత్తిన భక్తులు: సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లు!

తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఏడుకొండలపై రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవుదినం కావడంతో పాటు వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం అనుకూలించడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. ఆదివారం ఉదయం దేవస్థానం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

భక్తుల తాకిడి తీవ్రమవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపలికి విస్తరించి భక్తులు బారులు తీరి వేచి ఉంటున్నారు. శనివారం ఒక్కరోజే మొత్తం 82,181 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 37,633 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజులోనే శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.94 కోట్ల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం వచ్చిన పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి ఆలయంలో ‘పౌర్ణమి గరుడసేవ’ను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన ఈ దివ్య వేడుకలో అశేష భక్తజనం పాల్గొన్నారు. సర్వాభరణ భూషితుడై గరుడ వాహనంపై విహరించిన మలయప్ప స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

Posted Under AP
Editor