Latest Posts

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. ఫోన్ చేసి ఓదార్చిన ప్రధాని మోదీ!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సావిత్రి దేవి (91) ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్హ్వాల్ జిల్లాలో ఉన్న యోగి పూర్వీకుల గ్రామం పంచూర్‌లో శుక్రవారం ఉదయం సుమారు 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత మే నెలలో తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు తల్లిని కలిసి ఆప్యాయంగా సమయం గడిపిన యోగి ఆదిత్యనాథ్, ఇప్పుడు ఆమె మరణంతో తీరని శోకంలో మునిగిపోయారు.

సావిత్రి దేవి మరణవార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తూ యోగి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితర ప్రముఖులు సంతాప సందేశాలు పంపించారు.

సావిత్రి దేవి అంత్యక్రియలను శనివారం హరిద్వార్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. తల్లి మరణవార్తతో యోగి కుటుంబంతో పాటు స్వగ్రామం పంచూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Editor