విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదని, దీనిపై స్పష్టమైన కాలపరిమితితో కూడిన అఫిడవిట్‌ను ప్రభుత్వం నుంచి దాఖలు చేయించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ.. రాజధాని అమరావతి పరిధిలో అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పన పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని న్యాయస్థానానికి వివరించారు. కీలక ప్రాజెక్టులన్నింటినీ మూడేళ్ల కాలపరిమితిలో పూర్తి చేస్తామని ఇప్పటికే 2024 డిసెంబర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ 2022 మార్చి 3న హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును సవాలు చేస్తూ గత ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లు (SLP) ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం ప్రస్తావించింది. అంతేకాకుండా, పార్లమెంట్ చట్టం ద్వారా అమరావతికి రాజధానిగా పూర్తి చట్టబద్ధత లభించినందున గతంలో మూడు రాజధానుల అంశంపై దాఖలైన పలు పిటిషన్లు ఇప్పటికే నిరర్థకమయ్యాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యున్నత న్యాయస్థానంలో సెప్టెంబర్ 29న జరగనున్న విచారణ పరిణామాలను పరిశీలించిన తర్వాతే తాము తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ విచారణను వాయిదా వేసింది.
