నయనతార, యువ హీరో కవిన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ (Hi) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 26 నుంచి తమిళ భాషలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఆధునిక ప్రేమ, సంబంధాల్లోని సంక్లిష్టతలు, కుటుంబ ఒత్తిళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో నయనతార ఆత్మవిశ్వాసం కలిగిన యువతిగా కనిపించనున్నారు. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ, తనకు ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే యువతి.. అనుకోకుండా ఓ యువకుడిని కలుసుకోవడంతో ఆమె జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే ఈ చిత్ర కథాంశం. నేటితరం ప్రేమ, బంధాల్లోని భావోద్వేగాలను సహజంగా చూపించామని నయనతార తెలిపారు.
కవిన్ ఈ చిత్రంలో తన భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే యువకుడి పాత్రలో నటించారు. రాధికా శరత్ కుమార్, ప్రభు కీలక పాత్రలు పోషించగా, దిగ్గజ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కూడా ఇందులో కనిపించారు. ప్రేమ, కుటుంబ బంధాలు, వ్యక్తిగత సంఘర్షణలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.
