వైసీపీ-సీపీఐ దోస్తీపై విజయసాయిరెడ్డి ఫైర్: సజ్జలనే టార్గెట్ చేశారా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)తో కలిసి పనిచేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధిష్ఠానం నిర్ణయంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శలు వైసీపీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి.

రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై చర్చించేందుకు విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ బృందం గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ భేటీలో ప్రజా సమస్యలపై భవిష్యత్తులో ఉమ్మడి పోరాటం చేయాలనే సీపీఐ ప్రతిపాదనకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన విజయసాయిరెడ్డి, ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఘాటుగా పోస్ట్ చేశారు.

“వైఎస్సార్‌సీపీ.. కాంగ్రెస్‌ నాయకత్వంలోని ‘ఇండి’ కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐతో కలిసి ‘ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం’ చేయాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యకరం. పార్టీ అధ్యక్షుడికన్నా ఎత్తు కుర్చీలో కూర్చున్న సార్‌గారు, తన మాజీ పార్టీ (సీపీఐ)తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల రాజకీయ పర్యవసానాలు ఎలా ఉంటాయనేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణుల ఆలోచనకే వదిలేస్తున్నాను” అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ ‘ఎత్తు కుర్చీలో కూర్చున్న సార్‌గారు’ అంటూ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించే ఈ విమర్శలు చేశారని రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న ఈ తాజా పరిణామాలు వైసీపీ మరియు విపక్షాల మధ్య సరికొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముంది.

Posted Under AP
Editor