అరవకూరులో ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకాన్ని ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్

*అరవకూరులో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

గడ్డపార పట్టి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్ – శ్రామికులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి

అనంతపురం, జూలై 2 :
గ్రామీణ పేదల సాధికారత, సమగ్ర సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ – ఆజీవికా మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి)’ పథకాన్ని గురువారం ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ లాంఛనంగా ప్రారంభించారు.
అరవకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు కట్ట వద్ద జరుగుతున్న కాలువ కూడికతీత పనులను ప్రారంభించిన మంత్రి, అనంతరం స్వయంగా గడ్డపార పట్టి ఉపాధి హామీ పనుల్లో పాల్గొని శ్రామికుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కూలీలతో కలిసి మాట్లాడి, రోజువారీ వేతనం, పనిదినాలు, కూలీ చెల్లింపుల విధానం, ఇతర సంక్షేమ అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకం ద్వారా గ్రామీణ శ్రామికులకు సంవత్సరానికి 125 రోజుల వరకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, మెరుగైన వేతనాలతో పాటు కూలి చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ పథకం గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గ్రామసభల ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలను రూపొందించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ శ్రామికులంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డ్వామా పీడీ సలీం భాష, ఏపీడీ చెన్నకేశవులు, ఎంపీడీవో కుల్లాయి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor