Latest Posts

గుంతకల్లు రోజ్ గార్ మేళాలో 120 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందచేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

అనంతపురం జిల్లా,గుంతకల్లు.

గుంతకల్లు రోజ్ గార్ మేళాలో 120 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందచేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

: ఇచ్చిన మాటకు మించి ఉద్యోగ కల్పన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో వివిధ దఫాలుగా దాదాపు 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు పూర్తి : కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

– దేశ వ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఒకేసారి రోజ్ గార్ మేళా కార్యక్రమం నిర్వహణతో 51,000 మందికి పైగా యువతకు నియమక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా శుక్రవారం గుంతకల్లు రైల్వే ప్రభాత్ క్లబ్ నందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌ. కేంద్ర సహాయ మంత్రి హోమ్ అఫైర్స్ బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, ఎడిఆర్ఎం బి.ఎస్.శివప్రసాద్, డివిజనల్ పర్సనల్ అధికారి హెచ్.ఎల్.ఎన్ ప్రసాద్, తదితర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజ్ గార్ మేళాలో ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్న పలువురు అభ్యర్థులను ఉద్దేశించి గౌ.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సందేశాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, అధికారులు వర్చువల్ గా వీక్షించారు.

– ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పన మరియు రోజ్‌గార్ మేళా భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ‘రోజ్‌గార్ మేళా’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ గతంలో ప్రకటించిన విధంగా 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ దఫాలుగా దాదాపు 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు పూర్తి చేయడం విశేషం అని తెలిపారు. తాజాగా నేడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి, ఒకే రోజు 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను గొప్ప పండుగ వాతావరణంలోఅందచేస్తున్నారని అన్నారు. నూతనంగా విధుల్లో చేరుతున్న ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను వివరిస్తూ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు విధుల్లో ఉత్తమంగా రాణించడానికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం అధికారం కాదని, అది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశమని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, అప్పుడే దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోగలమని వివరించారు. గత పాలనలో ఉన్న అవినీతి, పైరవీల సంస్కృతిని విడనాడి, మోదీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల నుండి పాలన వరకు అంతా పారదర్శకంగా సాగుతోందని, దానిని ఉద్యోగులు కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. ఇందుకోసం ఐగాట్ (iGOT) కర్మయోగి ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా ‘దేశ ప్రయోజనాలే పరమావధి’గా ఉండాలని, తర్వాతే కుటుంబమని భావన ఉండాలని పేర్కొన్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో మన దేశ ప్రధాని పిలుపు మేరకు సప్త సూత్రాలను మనం ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని దేశ ఉజ్వల భవిష్యత్తుకు మనం అందరం కలిసి కృషి చేయాలని పేర్కొన్నారు. సాధ్యమైన చోట్ల Work From Home (WFH) ను ప్రోత్సహించాలనీ, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలనీ ప్రజా రవాణా, మెట్రో, EV వాహనాలు ఉపయోగించాలనీ, ఒక సంవత్సరం పాటు అనవసర విదేశీ ప్రయాణాలను నివారించాలనీ, స్వదేశీ (Swadeshi) ఉత్పత్తులను ప్రోత్సహించాలనీ,వంటనూనె వినియోగాన్ని తగ్గించాలనీ, రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనీ, అనవసరంగా బంగారం కొనుగోళ్లు తగ్గించాలనీ దేశాన్ని సంక్షోభంలో వెళ్లకుండా సహకరించాలని కోరారు. ఇండియా – పాకిస్తాన్ యుద్ధ సమయంలో జై జవాన్… జై కిసాన్ నినాదంతో ప్రజలకు ఒక పూట ఉపవాసం ఉండాలని ఇచ్చిన పిలుపుమేరకు సత్సంకల్పానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల కాలంలో కేంద్రం సుమారు 12లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాలు మరియు ప్రాజెక్టుల రూపంలో రాష్ట్రానికి కేటాయించిందనీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, కేవలం గత రెండేళ్లలోనే రాష్ట్రంలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా నూతన రాజధాని నిర్మాణం మరియు ఇతర అభివృద్ధి అవసరాల కోసం ఏపీకి 58,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం సమకూరుస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున కేంద్ర నిధులు రాష్ట్రానికి తేవడంలో సఫలీకృతులై నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి అవినీతి, సిఫార్సులు లేదా పైరవీలకు తావులేదని, కేవలం ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగా విధుల్లో చేరే ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచడానికి ఐగాట్ (iGOT) కర్మయోగి అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, ఇందులో దాదాపు 3,600 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి, వీటి ద్వారా ఉద్యోగులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవచ్చన్నారు. చివరిగా, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి మరియు భారత్‌ను ప్రపంచంలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి 2047 నాటికి ‘వికసిత భారత్’ నిర్మాణంలో ప్రతి ఉద్యోగి యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాము ఉద్యోగంలో చేరాక సమాజాన్ని, తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలని కోరారు. నరేంద్ర మోదీ గారు దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నారు తద్వారా దేశం ముందుకు వెళ్తుందని నమ్మిన ప్రభుత్వమని అన్నారు.

– ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో జరిగిన ఈ గొప్ప ఉపాధి సృష్టి కార్యక్రమంలో భాగమవడం నిజంగా ఆనందంగా ఉందని, భారత యువత దేశ నిర్మాణంలో ఉన్న అపార సామర్థ్యాన్ని గుర్తించిన ప్రధానమంత్రి గారు 2022 అక్టోబర్ 22న రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారనీ, ఈ రోజు 19వ రోజ్‌గార్ మేళా నిర్వహించబడుతోందనీ, ఇందులో రైల్వే మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖ సహా అనేక ప్రభుత్వ సంస్థల్లో నియామక పత్రాలు పొందనున్నారు అని తెలిపారు. ఈ వేడుకలో సుమారు 120 మంది ప్రతిభావంతులైన యువతకు నియామక పత్రాలను అందచేయడం జరుగుతుందని, ఇందులో 93 మంది అసిస్టెంట్ లోకో పైలట్లు, 13 మంది రైల్వేలో కాంపాషనేట్ గ్రౌండ్ అపాయింట్‌ మెంట్లు, 9 మంది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, 4 మంది బ్యాంక్ ఆఫ్ బరోడా, ఒకరు సివిల్ ఏవియేషన్ శాఖలో నియామక పత్రాలు పొందనున్నారన్నారు. నియామక పత్రాలు అందుకుంటున్న ప్రతి అభ్యర్థికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

– అనంతరం 120 మందికి సంబంధించిన నియామక పత్రాలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా అభ్యర్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor