నీటి సరఫరా కార్మికుల నిరవధిక సమ్మె
ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్
🙏🙏🙏🙏🙏🙏
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శ్రీ సత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె ప్రారంభమైంది. బుధవారం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, వైఎస్సార్టీయూసీ సంఘాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక దొడగట్ట రోడ్డు లోని సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు వద్ద కార్మికులు బైఠాయించి తమ సమస్యలు, డిమాండ్లను వెల్లడించారు. శ్రీ సత్యసాయి నీటి సరఫరా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయకుండా కొనసాగించాలని, జిల్లా పరిషత్‌లో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1997 నుంచి పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2026-27 బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు వినూత్న రీతిలో మోకాళ్లపై నిలబడి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఎం వన్నూరప్ప, టీ రాధాకృష్ణ, పి హనుమంత రాయుడు, ఆర్ పరంధామ, వి నగేష్ , బోరంపల్లి తిప్పేస్వామి, బి .ఎర్రి స్వామి, వి డి గంగన్న, ఎం లక్ష్మణస్వామి పాల్గొన్నారు.
