అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
మహిళల ఆర్థిక స్వావలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో రాయదుర్గం డిడబ్ల్యుఎంఏ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్ ఫోన్లు పంపిణీ, కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ, ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణాలు మంజూరు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ… చంద్రబాబు నాయకత్వంలో మహిళా సంఘాల సభ్యులు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు మహిళల ముఖాల్లో కొత్త వెలుగు కనిపిస్తుందన్నారు. సమాజంలో గౌరవం, అభిమానం పెరుగుతుందనే భావన వ్యక్తమౌతోందన్నారు. మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా సంఘాలు మూల స్తంభాలుగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వ సహకారం, బ్యాంకుల ప్రోత్సాహంతో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. చిన్న పొదుపులు పెద్ద మార్పులకు దారితీస్తున్నాయని, మహిళల చేతుల్లో ఆర్థిక శక్తి పెరిగితే కుటుంబాల స్థితి మెరుగుపడుతుందన్నారు. మహిళల ఆదాయం పెరగడం వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం వంటి కుటుంబ అంశాల్లో స్పష్టమైన మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో స్వయం ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. బ్యాంకు లింకేజీల ద్వారా మహిళలు వ్యాపార రంగంలో ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న రుణాలు వారికి ఆర్థిక బలం ఇస్తున్నాయని చెప్పారు. 2025_26లో దాదాపు రూ. 219కోట్ల రుణాలు మంజూరు చేశారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 5869 సంఘాల్లో 59,725 మంది సభ్యులు ఉన్నారన్నారు. ప్రస్తుతం 33 మంది మహిళలకు ఒక్కొక్కడికి లక్ష రూపాయలు చొప్పున సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో 50% సబ్సిడీ, 10% లబ్ధిదారుల వాటా మినహాయిస్తే.. 40 శాతం బ్యాంకు రుణం ద్వారా అందుతుందన్నారు. గ్రామీణ మహిళలు చిన్న వ్యాపారాల ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సంఘాలు సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని అన్నారు.
ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం సంకల్పించిందని, వారికి శిక్షణతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి మూలమని, మహిళలు ముందుకు వస్తే పేదరికం తగ్గడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించే దిశగా అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
