తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై చేసిన వ్యాఖ్యలు జాతీయ, ప్రాంతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మాట్లాడిన ఆయన, తాజాగా తన ‘వీ ది లీడర్స్’ (We the Leaders) ఉద్యమ వేదికగా మరోసారి స్పష్టతనిచ్చారు. తాను సీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు భావించరాదని స్పష్టం చేస్తూనే, ఆందోళనకారుల వెనుక ఉన్న అసలు కారణానికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. అలాగే తనకు ఎవరూ దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, దేశ సమైక్యత, సార్వభౌమత్వాలపై తనకు పూర్తి అవగాహన ఉందని విమర్శకులకు ఘాటుగా బదులిచ్చారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన నిరసనలను పోలీసులు అణచివేయడాన్ని అన్నామలై తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసనకారులు ఏవైనా తప్పులు చేస్తే కక్షసాధింపు చర్యలకు దిగకుండా చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అధికారులకు హితవు పలికారు. దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), రా (RAW) వంటి నిఘా సంస్థలను ఉపయోగించి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అంతేకానీ సోషల్ మీడియా లేదా ట్విట్టర్ వేదికగా ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం సహించబోమని ఆయన తేల్చిచెప్పారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను ప్రశంసిస్తూనే అన్నామలై ఒక స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశారు. మోదీ మంచి ప్రధాని అని, ఆయన సమర్థవంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూనే.. ప్రభుత్వ విధానాల్లో ఏదైనా తప్పు జరిగితే మాత్రం నిస్సంకోచంగా ప్రశ్నించడానికి తాము ఎప్పటికీ వెనుకాడబోమని కుండబద్దలు కొట్టారు.
