Latest Posts

పులివెందుల డీఎస్పీ తొలగింపుపై హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్: పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీకి ఆదేశం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ను ఎన్నికల విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల విధుల్లో సదరు అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే పులివెందుల డీఎస్పీని ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై సమగ్ర సమాచారాన్ని, వాస్తవ పరిస్థితులను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు, నివేదికలు సమర్పించేందుకు తమకు కొంత సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది కోర్టును కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పులివెందుల డీఎస్పీ విధులపై ఎన్నికల సంఘం హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తుందన్న అంశంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Posted Under AP
Editor