అనంతపురం :
*తాడిపత్రి టీడీపీ కార్యాలయంపై రాళ్ల దాడి వార్తలు పూర్తిగా అవాస్తవం– డీఎస్పీ ఎం.చంద్రశేఖర్*
-❇️ *పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు…కొనసాగుతోన్న ప్రశాంత వాతావరణం… వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి*
తాడిపత్రి పట్టణంలో పోరాట కాలనీలోని టీడీపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని తాడిపత్రి డీఎస్పీ ఎం.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాడిపత్రిలో అలాంటి అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగలేదని, పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా నియంత్రణలోనే ఉన్నాయని ఆయన తేల్చిచెప్పారు.
*కొనసాగుతున్న ప్రశాంత వాతావరణం*
ప్రస్తుతం తాడిపత్రిలో నామినేషన్ల ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు ఎన్నికల నిబంధనలకు లోబడి సహకరించాలని కోరారు.
*భారీ పోలీసు బందోబస్తు… వదంతులు సృష్టిస్తే కేసులు*
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పట్టణంలో ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, నిఘా మరింత పటిష్టం చేశామని చెప్పారు.
*డీఎస్పీ హెచ్చరిక* :
ప్రజల్లో అనవసర ఆందోళనలు సృష్టించేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు (వదంతులు) సృష్టిస్తే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.చంద్రశేఖర్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ప్రచారాలను, నకిలీ వార్తలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
