హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట 40 ఎకరాల భూమి వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్ దాఖలు చేయడంలో ప్రభుత్వం ఏకంగా 219 రోజుల సుదీర్ఘ ఆలస్యం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దీపంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం, నిర్ణీత గడువు దాటినందున దీనిని విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. దీంతో సదరు భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ సంస్థకే చెందుతుందంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో కొనసాగనుంది.
సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని సుమారు 40 ఎకరాల స్థలంపై చాలాకాలంగా ప్రభుత్వానికి, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ సంస్థకు మధ్య యాజమాన్య వివాదం నడుస్తోంది. ఈ భూమి తమదేనని సంస్థ వాదించగా, అది ప్రభుత్వ భూమి అని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనే హైకోర్టు ఆ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, హైడ్రా (HYDRA) అధికారులు ఆ స్థలంలోని నిర్మాణాలను కూల్చివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను ఆ పదవి నుంచి బదిలీ చేసి సమర్థుడైన మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలపై రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి స్టే పొందారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్‌ను తిరస్కరించడంతో లోతుకుంట 40 ఎకరాల భూమి యాజమాన్య హక్కుల వివాదంలో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకే పూర్తి ఊరట లభించినట్లయింది.
