రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం..

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
ముదిగుబ్బ, ప్రజాశక్తి: మలకవేముల పంచాయతీ పరిధిలోని ఎనుములవారిపల్లి గ్రామ రైతుల భూముల మీదుగా వెళ్తున్న 130 కేవీ విద్యుత్ హైటెన్షన్ లైన్‌కు సంబంధించిన నష్టపరిహారం సమస్యపై టీడీపీ నాయకులు అధికారులతో చర్చించారు.
రైతులకు తక్కువ నష్టపరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని, భూముల వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిహారం అందించాలని నాయకులు కోరారు. ఈ సమస్యపై గతంలో రైతులు నిర్వహించిన ఆందోళనకు ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ హాజరై రైతులకు మద్దతు తెలిపారు.
ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి రైతుల నష్టపరిహారం అంశంపై చర్చించారు. సరైన నష్టపరిహారం నిర్ణయించే వరకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. రైతులకు సాధ్యమైనంత మేర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా ముదిగుబ్బ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నందున అదనపు సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి, క్లస్టర్–3 ఇన్‌చార్జి చినగాని నరసింహ యాదవ్, మలకవేముల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, మాదాసు గంగాధర్, రవీంద్ర నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ఇనుములవారిపల్లి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor