మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణం…

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని (ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్) ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలూరు రాజకీయాల్లో కీలక నేతగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని హఠాన్మరణం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పవిత్రమైన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశంలో తెలిపారు.

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం మూడు దశాబ్దాల పాటు ఏలూరు కేంద్రంగా ప్రజలతో మమేకమై సాగింది. ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు, ఒకసారి శాసనమండలి సభ్యుడిగా (MLC) కూడా సమర్థవంతంగా సేవలందించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా విశేష సేవలందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య శాఖను ముందుండి నడిపించి ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేశారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరిన ఆయన అకాల మరణం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు మొత్తం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీరని విషాదాన్ని నింపింది

Posted Under AP
Editor