బాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఎన్ఎస్జీ కమాండో అమృత్ రాథోడ్ పాత్రలో అదిరిపోయే యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలోని నటన, యాక్షన్ స్టంట్స్‌కు గాను ఆయనకు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ‘రాఖ్’ ఫేమ్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ తెరకెక్కించనున్న సరికొత్త సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ‘ముసాఫిర్ కేఫ్’ ఫేమ్ నటి వేదికా పింటో హీరోయిన్గా నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్ట్‌లో లక్ష్యకు జోడీగా వేదికా పింటో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా ప్రేమకథను మానసిక కోణంలో చూపించేలా ప్రోసిత్ రాయ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా వేదికా పింటో పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ముసాఫిర్ కేఫ్’ తర్వాత ఆమె పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సైకలాజికల్ డ్రామా కావడంతో నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో ఈ సినిమా ఆమె కెరీర్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించి 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టైటిల్, పూర్తి తారాగణం, కథకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
