US-Iran Conflict: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్, బహ్రెయిన్‌లో టెన్షన్!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు వార్తలు రావడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి.

జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. సుదూర ప్రయాణ సామర్థ్యం కలిగిన RQ-4, MQ-9 డ్రోన్లు ఉన్న హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు వెల్లడించింది. అలాగే బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరంపైనా భారీ డ్రోన్ దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.

ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీలో ప్రసారమైన ప్రకటనలో.. దాడుల్లో పలు డ్రోన్లు ధ్వంసమైనట్లు, అమెరికా విమాన, సాంకేతిక సిబ్బందిలో కొందరు మరణించినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. సైనిక స్థావరంలోని సాంకేతిక మౌలిక సదుపాయాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నిప్పంటుకున్నట్లు తెలిపింది. అయితే ఈ వాదనలకు సంబంధించి అమెరికా, జోర్డాన్ నుంచి తక్షణ అధికారిక ధృవీకరణ రాలేదు. దీంతో ఇరాన్ చేసిన ప్రకటనల్లోని వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.

Editor