బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్.. ఆ తర్వాత తొలిసారి రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలకు సంబంధించిన పలు విషయాలు సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భేటీలో చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం కూడా అందులో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను నితిన్ నబిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాష్ట్రపతిని కలవడం తనకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ఈ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బీజేపీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది.
