ఐదు నెలలుగా వేతనాలు లేవు.. సెప్టెంబర్‌ 1 నుంచి నిరవధిక సమ్మె

ముదిగుబ్బ : శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ ప్రాజెక్టు (SSSWSP) కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం తాగునీరు అందిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
జీతాలు అందకపోయినా ఎండ, వాన, పండుగలు, సెలవులు లెక్కచేయకుండా ప్రజలకు తాగునీటి సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు. వేతనాల కోసం ప్రతిసారీ సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
ప్రాజెక్టుకు ప్రతి ఏడాది సరిపడా నిధులు కేటాయించి నిరంతరాయంగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కార్మికుల ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని, మృతిచెందిన, రిటైర్డ్‌ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీని చెల్లించాలని కోరారు.
డిమాండ్లు పరిష్కరించకపోతే సెప్టెంబర్‌ 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్ పాల్గొన్నారు. సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మధు, నరేష్, రాజారెడ్డి, వెంకటేష్‌ బాషా, మిద్ది వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor