మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే NEET పరీక్షకు సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తల్లిదండ్రులకు భావోద్వేగ లేఖ రాసినట్లు సమాచారం.
మృతుడిని సూరజ్ సుభాష్ షిండేగా గుర్తించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా వైజాపూర్ తాలూకా ఖండాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే ఇంటి పై అంతస్తులోని గదిలో NEET పరీక్షకు సన్నద్ధమవుతున్న సూరజ్ అక్కడే ప్రాణాలు తీసుకున్నాడు.
కుటుంబ సభ్యులు ఘటనను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చదువు, కెరీర్‌పై విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
