భారత్‌లో గొప్ప కాలేజీలు లేవని.. నా బిడ్డ అమెరికాలో చదువుతోంది: కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

దేశంలో విద్యావ్యవస్థ, ఉన్నత విద్యా ప్రమాణాల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, తన కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాల్సిన పరిస్థితిని ప్రస్తావించారు. దేశంలో అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడం వల్లే విద్యార్థులు విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుమార్తెను భారత్‌లోనే చదువుకోవచ్చు కదా అని అడిగినప్పుడు, “విదేశాల్లో ఉన్నంత గొప్ప కాలేజీలు మన దేశంలో ఎక్కడున్నాయి?” అని ఆమె ఎదురు ప్రశ్నించిందని కేటీఆర్ తెలిపారు. ఆమె ప్రశ్నకు తన వద్ద సరైన సమాధానం లేకపోయిందని, ఆమె అన్నది కూడా వాస్తవమేనని పేర్కొన్నారు. దేశంలో విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి.. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా కులం, మతం, ఆహారం, వస్త్రధారణ వంటి అంశాల చుట్టూ రాజకీయ పంచాయతీలు నడవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నాయని కొందరు గుర్తుచేస్తుండగా.. మరికొందరు మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మరిన్ని అత్యున్నత విద్యాసంస్థలను దేశంలోనే నిర్మించి ప్రతిభా వలసలను అరికట్టాలన్న కేటీఆర్ ఆకాంక్ష సరైనదేనంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
Editor