స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రతను పారదర్శకంగా అందించేందుకు చేపట్టిన ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంగారెడ్డి వేదికగా ఘనంగా ప్రారంభించారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తెచ్చుకునే ప్లాస్టిక్ ముక్క కాదని, అది నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆకలి తీర్చే బలమైన భరోసా అని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబం ఎవరి ముందూ చేయి చాచాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ద్వారా ఆహార భద్రతను గౌరవంగా పొందే హక్కును ఇది కల్పిస్తుందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో సుమారు 26 లక్షల మంది పేర్ల సవరణకు అవకాశం కల్పించడంతో పాటు, 2026 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారుల వివరాలను డిజిటలైజ్ చేయడం ద్వారా పంపిణీలో అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత తీసుకువస్తున్నామని తెలిపారు.
ఈ స్మార్ట్ కార్డుల ద్వారా నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించే ప్రక్రియ మరింత సులభతరం కానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను వివరించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతికతతో కూడిన ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో తెలంగాణలో ప్రజా సంక్షేమం కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Editor