లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి మయన్మార్ సరిహద్దులకు తరలించి సైబర్ నేరాలకు పాల్పడేలా వేధిస్తున్న అంతర్జాతీయ ముఠాల బారిన తెలుగు యువకులు చిక్కుకుంటున్నారు. ఇటీవల కొంతమంది తెలుగు విద్యార్థులు బ్యాంకాక్‌లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను బలవంతంగా మయన్మార్‌కు తరలించి సైబర్ నేరాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. బాధిత యువతను సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ఉపాధి మోసాల ముఠాల నుంచి యువతను రక్షించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, ఏపీ ఎన్ఆర్టీ సంస్థలతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోంది.
ఆగ్నేయాసియా దేశాల్లో పనిచేస్తున్న సైబర్ ముఠాల ఉచ్చులో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు యువకులు ఇప్పటికే చిక్కుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. భారత విదేశాంగ శాఖ సహకారంతో బాధితులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లే యువత అప్రమత్తంగా ఉండాలని, నియామక సంస్థలు, ఉద్యోగ ఆఫర్లు, వీసా వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.
