ఉరవకొండ, జూలై 3: ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.36.34 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చేయూత అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా అనేక మంది లబ్ధి పొందారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
వజ్రకరూరు, ఉరవకొండ పట్టణం, ఉరవకొండ రూరల్, బెలుగుప్ప, కూడేరు, విడపనకల్లు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయనిధి ద్వారా అందిన ఆర్థిక సాయానికి లబ్ధిదారులు ముఖ్యమంత్రి, మంత్రి పయ్యావుల కేశవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
