రెండేళ్లలో రాయదుర్గానికి రూ.1043 కోట్ల నిధులు తెచ్చాం.: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••

రెండేళ్లలో రాయదుర్గానికి రూ.1043 కోట్ల నిధులు తెచ్చాం.: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా… ఈ రెండేళ్ల కాలంలో రాయదుర్గం అభివృద్ధికి అత్యధికంగా రూ.1043 కోట్ల నిధులు తేవటం జరిగిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల వద్దకు తాను పదేపదే వెళ్లి ఈ ప్రాంత ప్రజల కష్టాలు, సమస్యలను విన్నవించడంతోనే ఇంత భారీ ఎత్తున నిధులు మంజూరయ్యాయని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాయదుర్గంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి, సంక్షేమం మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతోందన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
రాయదుర్గం నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు కూడా నిధులు తీసుకువచ్చామని ఎమ్మెల్యే వెల్లడించారు. గత టిడిపి ప్రభుత్వంలో రూ.968 కోట్ల వ్యయంతో ప్రారంభించి 30 శాతం వరకు పూర్తయిన జీడిపల్లి _ బైరవాణితిప్ప ప్రాజెక్టు పనులను వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి పాలనలో వీటిని పునః ప్రారంభించి పనుల్లో వేగం పెంచామన్నారు. 2028 జూన్ నాటికి పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. ఈ రెండేళ్లలో సాగునీరు, తాగునీటి పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.390 కోట్ల వ్యయంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే పథకాన్ని మూడు నెలల్లో ప్రారంభించబోతున్నట్లు వివరించారు. అలాగే అమృత్ _2 పథకం కింద రాయదుర్గం పట్టణంలో రూ.78 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి రక్షిత తాగునీటిని ఇవ్వడంతో పాటు అదనంగా 6200 కుళాయి కనెక్షన్లు ఇచ్చే పనులను జూన్ 24న ప్రారంభించబోతున్నామన్నారు. నియోజకవర్గంలో రాబోయే 20 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటిని రూపొందించామన్నారు. సాగునీటి అవసరాల కోసం రూపొందించిన మాల్యం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.112 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. అలాగే ఆవులదట్ల బ్రాంచ్ కెనాల్ పనులకు కూడా త్వరలో నిధులు మంజూరు చేయించుకుంటామన్నారు. తద్వారా నియోజకవర్గం లో అదనంగా 27వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జీడిపల్లి-బిటిపి పథకం ద్వారా మరో 10 నుండి 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజల రవాణా సౌకర్యార్థం రాయదుర్గం _అనంతపురం ప్రధాన జాతీయ రహదారిపై రూ.46 కోట్ల వ్యయంతో అర్ధాంతరంగా ఆగిన రైల్వే వంతెనను పూర్తి చేయించబోతున్నామన్నారు. చేయించామన్నారు. అలాగే కనేకల్ నుండి మాల్యం, కలేకుర్తి ప్రాంతాలకు రూ.64 కోట్ల వ్యయంతో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నిధులు మంజూరు చేయించామన్నారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.150కోట్లు వివిధ రహదారుల అభివృద్ధి, మరమ్మతు పనులకు మంజూరు చేయించగా, అందులో గుండ్లపల్లి-బళ్లారి, రాయదుర్గం-బళ్లారి రహదారి పనులకు రూ.12 కోట్లు కేటాయించామన్నారు. గ్రామీణ విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి రూ.84 కోట్లతో అవసరమైన పనులు చేయిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు రూ.8 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం వసతి గృహాల మరమ్మతు పనులకు రూ.17 కోట్లు, సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వ బడుల్లో అదనపు గదుల నిర్మాణం, మరమ్మతు పనులకు మరో రూ.13 కోట్లు మంజూరయ్యాయని ఆయన వివరించారు. ముఖ్యంగా గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణం పనులను ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవన నిర్మాణాలకు రూ.12 కోట్లు మంజూరు చేయించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల లబ్ధిదారులకు వివిధ రూపాలలో రూ.30 కోట్లు మంజూరు చేశామన్నారు. వైకాపా ప్రభుత్వం ఆపివేసిన డ్రిప్ సబ్సిడీని తిరిగి ప్రారంభించి రూ.40 కోట్ల విలువైన డ్రిప్ పరికరాలను రైతులకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ విద్యుత్తు పరికరాల ఏర్పాటు కోసం రూ.27 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రైతులకు విత్తు నుండి విక్రయం వరకు అన్ని దశలోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించని సందర్భంలో ప్రభుత్వమే కనీస మద్దతు ధరపై ధాన్యం, జొన్న, కంది మొదలగు పంట ఉత్పత్తులను కొనుగోలుచేసి రూ. 60కోట్లు రైతు ఖాతాల్లో జమా చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే సంక్షేమానికి సమ ప్రాధాన్యత నిస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ రూ.మూడు వేల నుండి రూ.4వేలకు పెంచడం జరిగిందన్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో రూ.16.65 కోట్ల విలువైన ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల చొప్పున మంజూరు చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా చదువుకుంటున్న పిల్లలకు రూ.18 కోట్లు ఆర్థిక చేయూత ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు సుమారు రూ.120 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గానికి ఇన్ని నిధులు మంజూరయ్యయన్నారు.
ప్రజల రక్షణ, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కాలవ స్పష్టం చేశారు. నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోనన్నారు. రాజకీయ కక్షలు, కార్పన్యాలకు రాయదుర్గం నియోజకవర్గంలో తావు లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకునేలా అందరికీ అవకాశం కల్పించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఆ దేవుడు తనకిచ్చిన శక్తి మేరకు రాబోయే మూడేళ్లు నియోజకవర్గ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల అవసరాలు తీరుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు.

Posted Under AP
Editor