పీఎండీఎస్‌పై రైతులకు అవగాహన కల్పించాలి – వరి స్థానంలో ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సాహం
అనంతపురం, జూన్ 17:
ఈ ఏడాది ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక తదితర అనుబంధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రైమరీ సెక్టార్ సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
జిల్లాలో రెండు లక్షల ఎకరాల మేర ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధానంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన తక్కువగా ఉందని, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు.
వరి సాగు తగ్గించాలి
జిల్లాలో ప్రస్తుతం 22 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని, అధిక నీటి అవసరం ఉన్న వరి స్థానంలో ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే చెరకు సాగును కూడా తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని పేర్కొన్నారు.
ఆఫ్ మూన్ మోడల్‌కు ప్రాధాన్యం
25,547 మంది రైతులకు 38,500 ఎకరాల్లో “ఆఫ్ మూన్ మోడల్” ద్వారా పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 798 మంది రైతులు 1,086 ఎకరాల్లో మాత్రమే అమలు చేశారని తెలిపారు. ఈ పద్ధతిని మరింత విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విత్తనాలు, ఎరువుల పంపిణీ సజావుగా జరగాలి
ఖరీఫ్-2026 సీజన్‌కు జిల్లాకు 52,500 క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ విత్తనాలు, 2,040 క్వింటాళ్ల కందులు కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే 18 వేల మంది రైతులు నమోదు చేసుకున్నారని, రైతు సేవా కేంద్రాల్లో 13,500 క్వింటాళ్ల వేరుశనగ నిల్వ ఉంచినట్లు తెలిపారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అలాగే ఖరీఫ్‌కు అవసరమైన 55,133 క్వింటాళ్ల యూరియా, డీఏపీ తదితర ఎరువులు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ-పంట నమోదు పూర్తి చేయాలి
ఖరీఫ్-2026కు సంబంధించిన ఈ-పంట నమోదును ఎస్‌ఓపీ ప్రకారం వేగవంతం చేయాలని, సెప్టెంబర్ 15 వరకు నమోదుకు గడువు ఉన్నందున క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పశుగ్రాసం, వ్యాక్సినేషన్‌పై దృష్టి
ఎల్-నినో ప్రభావంతో పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశం ఉందని, ముందస్తుగా ఫాడర్ సీడ్ అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో పశువులకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
సహజ వ్యవసాయం, అగ్రి స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఏపీసీఎన్ఎఫ్ కింద సహజ వ్యవసాయాన్ని విస్తరించాలని, కుందుర్పి మండలాన్ని సహజ వ్యవసాయ నమూనాగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించి, పీఎంఎఫ్‌ఎంఈ కింద మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసి మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాలురెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
