రాజకీయాల్లో వైసీపీ ఓ విషనాగు!

అనంతపురం జిల్లా రాయదుర్గం

రాజకీయాల్లో వైసీపీ ఓ విషనాగు!

రాజకీయాల్లో వైసీపీ ఓ విషనాగు లాంటి పార్టీ అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ద్వజమెత్తారు. ఎన్డీయే కూటమి పాలనకు రెండేళ్లు నిండిన సందర్బంగా రాయదుర్గం నియోజకవర్గం కల్యం గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అయిదేళ్ల జగన్ అరాచక పాలనలో చిన్నాభిన్నమైన వ్యవస్థలను రెండేళ్లలో గాడిలో పెట్టిన దార్శనికుడు చంద్రబాబు నాయుడన్నారు. ఎన్నికల హామీల్లో 90శాతం నెరవేర్చడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలను జీర్ణించుకోలేని జగన్ రెడ్డి అనునిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ ని నిర్వహిస్తే దానిపై కూడా సత్యదూరమైన ఆరోపణలకు జగన్ అండ్ కో తెగబడుతోందని విమర్శించారు.
ఇలాంటి విష పార్టీకి రాష్ట్రంలో ఎక్కడ తావు లేకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఇదే నేపథ్యంలో అనుక్షణం పేద ప్రజల బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. తద్వారా మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల సహకారంతో రాయదుర్గం ప్రాంతానికి ఎక్కువ నిధులు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు, ఇబ్బందులు, అవస్థల గురించి పదేపదే వారికి విన్నవించడం జరుగుతోందన్నారు. గడిచిన రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం లో ఇతర ప్రాంతాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మనం ముందుకు వెళుతున్నామన్నారు. రాబోయే మూడేళ్లలో ఇదే విధమైన సహకారాన్ని ప్రజల నుండి తాను ఆశిస్తున్నానన్నారు. రాయదుర్గం ప్రజల అభివృద్ధి, సంక్షేమం మినహా తనకు ఇతరత్రా ఎలాంటి పనులు లేవన్నారు. రాయదుర్గమే తన ప్రపంచం అన్నట్టు స్థానికంగా ఉంటూ ఇక్కడ ప్రజలతో నిత్యం కలసి మెలసి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎక్కడ రాజకీయ పరమైన గొడవలు ఉండమని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎవరి పనులు వారు చేసుకోవచ్చన్నారు.
2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే 90% హామీలను నెరవేర్చడంతో పాటు ఇవ్వని హామీలను కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో ప్రధానంగా జీడిపల్లి నుండి బైరవాణితిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకువెళ్లే కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో మాల్యం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. అమృత్ _2, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే పనులు కూడా చేపడుతున్నామన్నారు. అలాగే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. టిడిపి అంటేనే పేదల పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతి పేదకు కూడు, గుడ్డ, గూడు అనే నినాదంతో పార్టీని స్థాపించారన్నారు. ఆడపడుచులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ స్వయం సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కోటి మంది మహిళలతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాదలూరు మోహన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు వసుంధర,అంబోజి రావ్, జనసేన నాయకులు,కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కరేగౌడ్ర మంజునాథ, కల్యం తిప్పేస్వమి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ యు.హనుమంత రెడ్డి,జిల్లా ఉపధ్యక్షుడు లాలేప్ప, పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి,మండల పార్టీ అధ్యక్షులు కురుబ హనుమంతు, కాలవ సన్నన్న, వన్నా రెడ్డి, సదాశివ రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జి తలారి గంగాధర్,మొండి మల్లికార్జున,.పెద్దమడి ఆనంద రెడ్డి, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor