అనంతపురం జిల్లా కలెక్టరేట్
ఈనెల 21వ తేదీన నీట్ పునఃపరీక్ష నిర్వహణ
– : ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..
అనంతపురం, జూన్ 15 :
– ఈనెల 21వ తేదీన నీట్ పునఃపరీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వారు ఈనెల 21వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test, NEET)ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ (యుజి) పునఃపరీక్షపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈమధ్య నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో నీట్-2026 రద్దయిన కారణంగా ఈనెల 21వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 05:15 గంటల వరకు నీట్ పునఃపరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 3,959 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అనంతపురం జిల్లాలో 9 కేంద్రాల్లో నీట్ పునఃపరీక్ష నిర్వహించడం జరుగుతుందని, అందులో 1.బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామం వద్దనున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2. అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ (ఆర్ట్స్ కాలేజ్) వద్దనున్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, 3. నగరంలోని ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, 4. అనంతపురం నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జేఎన్టీయూ ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ( అటోనమస్), 5. అనంతపురం నగరంలోని ఆర్టీవో ఆఫీస్ వద్దనున్న కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, 6. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో, 7. అనంతపురం నగరంలోని శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజ్లో, 8. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్దనున్న పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలో, 9. గుత్తి టౌన్ మరియు మండలంలోని కర్నూల్ రోడ్ లో ఉన్న గుత్తి పోలీస్ స్టేషన్ వద్దనున్న జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ లో నీట్ పునఃపరీక్ష జరుగుతుందన్నారు. అనంతపురం నగరంలో 7 కేంద్రాల్లో, గుత్తి పట్టణంలో 2 కేంద్రాల్లో నీట్ పునఃపరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా యంత్రాంగం తరుపున జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మలోలని నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డ్ తో పాటు ప్రభుత్వంచే గుర్తింపబడిన ఏదో ఒక గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. నీటి పరీక్ష రాసే అభ్యర్థులకు 15 నిమిషాలు అదనపు సమయం ఇవ్వడం జరిగిందన్నారు. పేపర్ లీకేజీ కారణాల దృష్ట్యా ఎస్కార్ట్ అనేది పటిష్ట బందోబస్తు మధ్య పేపర్ తరలించడం చేయాలని, అన్ని కేంద్రాల్లో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. నీట్ పునఃపరీక్ష కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ పరీక్ష అత్యంత కీలకమైనదని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ పరీక్షను విజయవంతంగా చేయాలని, సజావుగా నిర్వహించాలని, ఇందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
– ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మలోల, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, కోఆర్డినేటర్లు, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.
