అనంతపురం జిల్లా రాయదుర్గం
* పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యము, ఆహ్లాదము, ఆనందం కోసం చంద్రబాబు నాయుడు పార్కు పునః నిర్మాణం
* ఎమ్మెల్యే, కాల్వ శ్రీనివాసులు
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకు రేపటితో రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ నిధులు రూ. 15 లక్షలు, రూ. 25 లక్షలు సాధారణ నిధులతో పునః నిర్మించిన చంద్రబాబు నాయుడు పార్కును స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్కులో ముందుగా వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు, పెద్దలకు ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను మున్సిపల్ అధికారులు, తెదేపా నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పార్కు అభివృద్ధి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలవ మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లోని పరిసర కాలనీల ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక వరం ఇవ్వడం జరిగిందన్నారు.
30 సంవత్సరాల క్రితం రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తెదేపా నేత జితేంద్రప్ప చంద్రబాబు నాయుడు పేరుపై పార్కు ఏర్పాటు చేశారన్నారు. తర్వాత ఆనవాళ్లు పూర్తిగా లేకుండా పోవడంతో, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పార్కును రూ. 40 లక్షలతో ప్రహరీ నిర్మాణము, ఆట వస్తువులు, మొక్కలు నటించి, పచ్చని చెట్లతో పార్కును అభివృద్ధి చేసి సుందరంగా నిర్మించామన్నారు.
రాయదుర్గం పట్టణ సమీపంలో అటవీ శాఖ భూములలో పిల్లలకు, పెద్దలకు నగర వనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే జెఆర్ఎస్ కాలనీ, టీచర్స్ కాలనీల్లోని మున్సిపల్ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. వీటితో పాటు రాయదుర్గం పట్టణంలో సామూహిక పార్కులు, స్థలాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు పార్కును పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని, దీంతో ప్రజలు, మహిళలు, పిల్లలలో ఆనంద లోగిళ్లు పరిణమించి ఉన్నతంగా బాసిల్లాలని దృఢంగా విశ్వసిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
