ఉరవకొండకు నిధుల వెల్లువ.. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ….

అనంతపురం జిల్లా.

ఉరవకొండకు నిధుల వెల్లువ.. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ

అసంపూర్తి భవనాల నిర్మాణాలకు వరుసగా నిధుల మంజూరు

– గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు వారం రోజుల కిందట రూ.9.61 కోట్లు మంజూరు
– అసంపూర్తిగా ఉన్న 32 రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రెండు రోజుల కిందట రూ.6.33 కోట్లు విడుదల
– తాజాగా 57 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ.5.39 కోట్ల మంజూరు చేస్తూ ప్రత్యేక జీవో విడుదల

అనంతపురం, మే 28:

రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో ఉరవకొండ నియోజకవర్గానికి నిధుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఉరవకొండ అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించడం వల్ల పలు అభివృద్ధి పనులకు వరుసగా నిధులు మంజూరవుతున్నాయి.

గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా మిగిలిపోయిన సచివాలయ భవనాలు, రైతు సేవా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు మంత్రి అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.9.61 కోట్లు, రెండు రోజుల కిందట 32 రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ.6.33 కోట్లు మంజూరు చేయించారు.

తాజాగా గురువారం ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఆగిపోయిన 57 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం కోసం రూ.5.39 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జీవో ఆర్టీ నం.87ను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఏ. సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, తాను ఎక్కడ ఉన్నా ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి మొదటి కూలీగా పనిచేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉరవకొండ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Posted Under AP
Editor