రాయదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో రాయదుర్గం మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో తగినంత నీరు ఉన్నప్పటికీ, పట్టణ ప్రజలకు ఐదు రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా చేయలేకపోవడానికి గల కారణాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటం వల్ల నీటి పంపింగ్‌లో సమస్యలు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి వివరించారు.
ప్రస్తుతం టీ వీరాపురం సబ్‌స్టేషన్ నుంచి కనేకల్లు ఎస్ఎస్ ట్యాంక్ పంపింగ్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కనేకల్లు సబ్‌స్టేషన్ నుంచే ఎస్ఎస్ ట్యాంక్ పంపింగ్ స్టేషన్‌కు నేరుగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సుమారు రూ.30 లక్షలకు పైగా వ్యయం అవుతుందని, అవసరమైన పనులకు అనుమతులు తీసుకుని త్వరలో ప్రారంభిస్తామని విద్యుత్ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు.
అలాగే రాయదుర్గం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రాయదుర్గం సబ్‌స్టేషన్ నుంచే సరఫరా అందిస్తే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు వివరించారు.
ప్రస్తుతం ఉన్న పింగాణి ఇన్సులేటర్ల స్థానంలో పాలిమర్ ఇన్సులేటర్లు అమర్చాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ పనులను 15 రోజుల్లో పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ ఇ.ఇ .చక్రవర్తి హామీ ఇచ్చారు.
ఈ వారంలోనే రాయదుర్గం పట్టణ తాగునీటి పథకానికి విద్యుత్ సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
