శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠా నుండి స్వాధీనం చేసుకున్న కోటి 26 లక్షల రూపాయల నగదు, మూడు కార్లు, 13 సెల్ ఫోన్లు మరియు మారణాయుధాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం మీడియా ముందు ప్రదర్శించారు. కేరళకు చెందిన సిరిల్ మ్యాథ్యూ ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ ముఠా, జాతీయ రహదారులపై భారీ నగదుతో వెళ్లే వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని అపహరణలు, దోపిడీలకు పాల్పడుతోందని ఎస్పీ వివరించారు.
గత డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో కియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు భారీ దోపిడీ కేసులను ఛేదించేందుకు ఎస్పీ పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేపాల్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రధాన నిందితుడితో పాటు మొత్తం పది మందిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఈ ముఠా మొత్తం 5 కోట్ల రూపాయలకు పైగా దోపిడీకి పాల్పడినట్లు గుర్తించామని, మిగిలిన 11 మంది నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.
